Vinayaka Jannam | వినాయక / గణపతి జననం

Vinayaka Jannam in Telugu :-

వినాయకోత్పత్తి

కైలాసంబున పార్వతి భర్తరాకను దేవతాదులవలన విని ముదమంది అభ్యంగ స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో నొక బాలునిచేసి, బ్రాణంబొసంగి, వాకిలిద్వారమున కాపుంచె, స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొని పతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి, లోపలికి పోబోవ ద్వారమందున్న బాలకుడడ్డగింప కోపావేశుడై త్రిశూలముచే నా బాలకుని కంఠంబు దునిమి లోనికోగె.

పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు పూజించె, వారిరువురును ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును నాబాలుని కతికించి ప్రాణంబొసంగి గజాననుండని నామంబొసంగె అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జన్మించె. ఇతడు మహాబలశాలి, ఇతని వాహనము నెమలి, ఇతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచియుండెను.

Leave a Comment