Vinayaka Adipthyam | వినాయక / గణపతి ఆధిపత్యం

Vinayaka Adipthyam in Telugu :-

విఘ్నేశాధిపత్యము

         ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగమనిరి, గజాననుడు మరగుజ్జువాడు, అసమర్ధుడు గాన ఆయాధిపత్యంబు తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనెను. “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో వారికా యాధిపత్యం బొసంగుదునని మహేశ్వరుడు పలుక, సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబెక్కి వాయువేగంబున నేగె, గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా ! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయ తగునే ! మీ పాదసేవకుండనగు నాయందు కటాక్షముచి తగు నుపాయంబు దెల్పి రక్షింపవే. యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృన్నారాయణేత్యుక్త్వాపుమాన్ కల్పశతత్రయం | గంగాది సర్వతీర్దేషు స్నాతోభవతి పుత్రక” కుమారా ! ఒక్కసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్య నదులలో స్నామొనర్చిన వాడగునని సక్రమంబుగ నారాయణ మంత్రం నుపదేశింప గజాననుడు అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబుననుండె.

         అమ్మంత్ర ప్రభావంబున అంతకుపూర్వము గంగానదికి స్నానమాడ నేడిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసమునకేగి తండ్రి సమీపమందున్న గజాసురునిగాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, తండ్రీ ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని క్షమించుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు” డని ప్రార్ధించె. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామము సేయబోవ కడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగా నవ్వె, అంత “రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు” నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడలం దొర్లెను. అతండును మృతుండయ్యెను. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, “పాపాత్ముడా ! నీ దృష్టి తగిలి నాకుమారుడు మరణించెను గాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక !” యని శపించెను…

Leave a Comment