Vinayaka Katha in Telugu :-
విఘ్నేశ్వరుని కథా ప్రారంభం
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్ర దర్శన దోషకారణంబును, తన్ని వారణంబును చెప్పదొడంగెను.
పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోరతపం బొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు గోరుమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి స్వామీ ! నీవు ఎల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్త సులభుడగు నా మహేశ్వరుండాతని కోర్కె దీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి’ సుఖంబుండె.
కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుండగుట దెలిసి రప్పించుకొను మార్గంబుగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం దెల్పె. ఓ మహానుభావా ! పూర్వం భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నా కొసగితివి. ఇపుడు గూడ నుపాయాంతరముచే రక్షింపుమని విలపింప, హరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు, గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలచే తలకొక వాయిద్యమును ధరింపచేసి, తానును చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసుర పురంబు జొచ్చి, జగన్మోహనంబుగా నాడించుచుండ, గజాసురుడు విని వారల పిలిపించి తన భవనము యెదుట నాడించ నియమించెను. బ్రహ్మాది దేవతల వాద్యవిశేషంబులు జోరోగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిత్రముగా గంగిరెద్దునాడించగా గజాసురుడు పరమానంద భరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చెగాన శివునొసంగు”మని పల్కె ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని “నాశిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మమును నీవు ధరింపవె” యని ప్రార్థించి, విష్ణుమూర్తికి అంగీకారము దెలుప, హరి నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసురగర్భమునుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించె. అంత నాహరి “దుష్టాత్ముల కిట్టివరంబు లీయరాదు, యిచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని, యుపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలిపి తానును వైకుంఠమున కరిగె. శివుండు నందినెక్కి కైలాసంబున కతివేగమున జనియె.